Telugu Schools – Interview

సిడ్నీ తెలుగు అసోసియేషన్ తెలుగు బడులపై ముఖాముఖి

సిడ్నీ తెలుగు అసోసియేషన్ తెలుగు బడులపై  శ్రీ జాస్తి విష్ణు చైతన్య (ఆఫ్ ఈనాడు,  చైర్మన్ సచివాలయం & రామోజీ ఫౌండేషన్, రామోజీ ఫిల్మ్ సిటీ) గారితో ముఖాముఖి 9-జనవరి-2020. 

సిడ్నీ తెలుగు అసోసియేషన్ ఏర్పాటు లక్ష్యమేంటి?

తెలుగు అసోసియేషన్ 1993 లో స్థాపించబడింది. దీని ముఖ్యోద్దేశాలు 1) తెలుగు వారి సామాజిక, సాంస్కృతిక పురోభివృద్ధికి తోడ్పడుట,2) తెలుగు వారికి సహాయ కార్యక్రమాలలో సహకరించుట లేదా అందించుట, 3) తెలుగు సాంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుట, పురోభివృద్ధికి తోడ్పడుట.
ఈ లక్ష్యాలను సాధించడానికి గాను అనేక కార్యక్రమాలు రూపొందించారు. వాటిలో కొన్ని: తెలుగు బడి, తెలుగు వాణి (radio program), తెలుగు వాహిని (news magazine), వనితా మండలి, Seniors Forum, Web Portal మొదలైనవి. ఇవి కాకుండా దీపావళి సంబరాలు, ఉగాది వేడుకలు ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. వనితా మండలి “Cancer Council” కి ఫండ్ రైజింగ్ activity నిర్వహిస్తుంది. ఇటువంటి కార్యక్రమాల ద్వారా తెలుగు community ఉనికి NSW లో అందరికీ తెలిసి వచ్చింది.
తెలుగు వారు ఏప్రాంతం వారైనా అసోసియేషన్ లో Life Members గా లేదా Annual Members గా చేరవచ్చు.

మీరు ఈ  అసోసియేషన్  తెలుగు బడిలో ఎలా భాగస్వాములయ్యారు?

నాకు తెలుగు అసోసియేషన్ తో మొదటి నుండి సంబంధం ఉంది ఎందుకంటే, నేను 1993 లో formation కమిటీకి Secretary గా పనిచేశాను, ఆ తర్వాత President గా, వాహిని Editor గా, తెలుగు వాణి Broadcaster గా కూడా పనిచేశాను. 2010 నుండి తెలుగు బడి సంచాలకుడిగా బాధ్యత తీసుకున్నాను.

మొత్తం ఎన్ని తెలుగు బడులు నిర్వహిస్తున్నారు? వీటికోశం ఎలాంటి ప్రాంతాలను ఎంపిక చేసుకున్నారు?ప్రస్తుతం సిడ్నీలో ఐదు (5) తెలుగు బడులు నడుపుతున్నాము. ఎక్కడ తెలుగు వారు, ముఖ్యంగా “యువ” కుటుంబాలు ఉన్నాయో అక్కడ, లేదా ఏదైనా ఏరియా లో “మాకు తెలుగు బడి కావాలి” అని ఉత్సాహంగా అడుగుతారో అక్కడ బడి ప్రారంభిస్తాము.

తెలుగు బడి ప్రారంభంలో మీరు ఎదుర్కున్న ఇబ్బందులులేంటి?
తెలుగు బడి 1993 లోనే ప్రారంభమయ్యింది. ఆనాడూ, ఈనాడూ కూడా అవే సమస్యలు. పిల్లలు రెగ్యులర్ గా బడికి రాకపోవడమే. అది ఏ యాజమాన్యం చేతిలోను లేని పని. మిగిలిన వనరులు అంటే teachers, books, classrooms మొదలైనవి అందించడానికి volunteers ఉన్నారు.
బళ్ళలో ఎంతమంది విద్యార్థులున్నారు? వారి తల్లిదండ్రులతో ఎలా సమన్వయం చేసుకుంటారు?
ఈ ఐదు బడులలో 2019 సంవత్సరంలో 150 మంది పిల్లలు ఉన్నారు. 2020 లో ఇంతకన్నా ఎక్కువమంది పిల్లలు వస్తారని మా అంచనా. తెలుగు చెప్పడమనేది కేవలం బడి బాధ్యతే కాదు, parents కూడా శ్రద్ధ వహించాలి. అప్పుడే అది ఫలిస్తుంది. ప్రతి స్కూల్ కి కొందరు parents ని classroom లో volunteers గా చేర్చుకుంటాము. వాళ్ళ వల్ల classwork చేయించడంలో లేదా activities చేయించడంలో పిల్లలకి personal attention లభిస్తుంది. Whatsapp ద్వారా parents’ groups లో communicate చేస్తాము. వాటిలో Tests, special activities వంటి విషయాలపై చర్చలు జరుగుతాయి, ఈ విషయాల్లో బడి parents నుండి ఏ సహకారం ఆశిస్తుందో అందరికీ తెలుస్తుంది.

మీ బళ్లలో తల్లిదండ్రులలే ఉపాధ్యాయులు కదా. వారిని ఎలా ఎంపిక చేస్తున్నారు? మొత్తం ఎంతమంది ఉన్నారు?

తెలుగు బడిలో మేము చెప్పే తెలుగు ప్రాధమిక స్థాయి. ఇక్కడి పేరెంట్స్ అందరూ కనీసం డిగ్రీ చేసిన వారే, అందరూ తెలుగు వచ్చిన వాళ్ళే. ఎవరైనా ప్రతి వారం 3 గంటలు సమయం బడికి ఇవ్వగలిగితే వారు Teachers గా ఆహ్వానితులే. అలా కాని పక్షంలో అప్పుడప్పుడు రాగలము అంటే, వారిని Support Officer గా తీసుకుంటాము. ప్రస్తుతం 15 మంది teachers ఉన్నారు. వీరు కాక, నాతో పాటు ఇద్దరం management staff ఉన్నాము.
తెలుగు రాష్ట్రాలలో తయారయ్యే పుస్తకాలు సిడ్నీలో సరిపోవని, అక్కడే ముద్రిస్తున్నామని చెప్పారు. అక్కడి పాఠ్యాంశాల రూపకల్పనలో ఉండే వైవిధ్యం ఏమిటి?
మన తెలుగు రాష్ట్రాలలో పిల్లలు పుట్టుకతోనే తెలుగు నేర్చుకుంటారు. వాళ్ళు బడికి వెళ్ళే సమయానికి తెలుగు భాష క్షుణ్ణగా మాట్లాడగలరు. అక్కడ మనకి లాభ్యమయ్యే పుస్తకాలు వారికి, అంటే తెలుగు మాట్లాడడం సహజంగా వచ్చిన పిల్లలకి, అనుగుణంగా, అక్కడి పరిసరాలు చూపే బొమ్మలతో అందంగా ఉంటాయి. కానీ, ఇక్కడ అంటే Australia లో పుట్టి పెరిగే పిల్లలు ఇంట్లో కన్నా Play Schools లో తమ బాల్యం గడుపుతారు. అందరితో English లో మాట్లాడుతారు. ఇంట్లో తెలుగు వినొచ్చు కానీ మాట్లాడరు.
బడిలో తెలుగు చెప్పడం కేవలం పాఠాలకే కాదు పరిమితం. భాషా పరంగా, పరిసరాల పరంగా, ఇక్కడి విద్యావిధానాల పరంగా ఆలోచించి పిల్లల స్థాయీకి దిగి చెప్పాలి.
భాషా పరంగా తెలుగులో వాక్యాలకి వరస కర్త-కర్మ-క్రియ, కానీ ఇంగ్లిష్ లో వరస కర్త-క్రియ-కర్మ. క్రియా పదాల్లో లింగాన్ని వచనాన్ని బట్టి వచ్చే మార్పులు అనేకం. (ఉదా. I/He/She/They ate ఇక్కడ ate అన్న పదానికి “తిన్నాను/తిన్నాడు/తిన్నాది (తింది)/తిన్నారు” అని ఇన్ని inflections వస్తాయి). ఇవి భాష రాని పిల్లలకు తెలియజెప్పడం అంత సులభంకాదు. ఇటువంటి విషయాలు వాళ్ళకి చెప్పకుండానే తెలియ జెప్పాలి.
ఇక్కడి పరిసరాలకి తెలుగు రాష్ట్రాలలో పరిసరాలకి ఎంతో వెత్యాసం ఉంది. ఉదాహరణకి “అమ్మ” అన్న పదానికి, సాధారణంగా కొప్పులో పూలు చంకలో పిల్ల, చీరకట్టులో స్త్రీ బొమ్మ చూపుతారు. అంటువంటి “అమ్మ”ని ఇక్కడ పిల్లలు చూసి ఉండరు. అంటే ఆ పుస్తకాల్లో ఉన్న మాటకి బొమ్మకి ఇక్కడి పిల్లలకు పొంతనలేదు. “A picture is worth a thousand words” అన్న adage ఇక్కడ తప్పుతోంది.
ఇక్కడి విద్యా విధానాలను అనుసరిస్తూ తెలుగు చెప్పాలి. ఇక్కడి పిల్లలకు “దిద్దడం” అనే concept లేదు. Hands-on ప్రొజెక్ట్స్ పరంగా నేర్చుకుంటారు. మనం conventional గా తెలుగు నేర్పితే వాళ్ళు బడికి రారు. ఈ సమస్య మేము గతంలో ఎదుర్కున్నాము.
వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని పాఠ్య పుస్తకాలు, Teaching Guides కి రూపకల్పన చేశాము.
పాఠ్యాంశాలు ఎవరితో రాయిస్తున్నారు? ఏవరెవరి సలహాలు తీసుకుంటున్నారు?
పాఠ్య పుస్తకాలు నేనే రాశాను. వీటికై పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటి ఆచార్యులను సంప్రదించాము. వారి సూచనల మేరకు మార్పులు చేశాము. ఆదేకాక, నేను Hyderabad లో కొన్ని convent schools కి వెళ్ళి అక్కడి తెలుగు చెప్పే teachers ని కలిసాను. వాళ్ళ పుస్తకాలను, classrooms లో పాఠాలు చెప్పే ప్రస్తుత విధానాలను అధ్యయనం చేశాను. Teaching తో సంబంధంలేని నాకు అనేక విషయాలు తెలిసాయి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని పుస్తకాలు మొదలైనవి తయారు చేసాను.

NSW Public Schools లో తెలుగును ప్రవేశపెట్టాలని చూస్తున్నారు కదా? దాని కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? 

దీనికి రెండు ముఖ్యమైన సమస్యలు పరిష్కరించాలి. 1) పాఠ్యపుస్తకాలు 2) qualified teachers.
NSW పబ్లిక్ స్కూళ్ళలో ఏ భాషైనా ప్రవేశపెట్టాలంటే కొన్ని స్టాండర్డ్స్ పాటించాలి. NSW Education Standards Authority of NSW వారు K-12 Framework For Developing Community Languages Curriculum (K-12 అంటే Kindergarten to Year 12) అని ఒక డాక్యుమెంట్ పబ్లిష్ చేశారు. ఇది “outcomes based” approach ని ప్రతిపాదిస్తుంది. దీని ప్రకారం, పిల్లలు ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటారో దాంట్లో ప్రతి స్టేజ్ లోనూ నిర్దిష్టమైన సమర్థత ఆ భాషలో పొందాలి. దానికి అనువుగా పాఠాలు ఆ భాషల బడులు నిర్నయించుకోవాలి. ఒక తెలుగు కమ్యూనిటిగా ఆ బాధ్యత మనమే తీసుకోవాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని primary తరగతుల వరకు (అంటే Kindergarten to Year 6) నేనే అనేక textbooks, workbooks, story books, కొన్ని వేమన, సుమతి, కృష్ణ శతక పద్యాలకు వివరణలు, గేయాల సంపుటి, posters, games మొదలైనవి తయారు చేసాను. ఇవే కాకుండా Google Classroom లో వాడుకుందుకు వీలుగా Quizlet అనే app ని వాడి 190 పాఠాలు తయారు చేశాను. ఇక్కడి lifestyle ని ప్రతిబింబించే అనేక పాఠాలు, కథలు ఇక్కడి పి‌ల్లలకు తగ్గట్టుగా సరళంగా రాసాను. ఈ విధంగా మొదటిది సమస్యకు పరిష్కారం తెచ్చాము.
రెండవది తెలుగు చెప్పగలిగే qualified టీచర్లు. సిడ్నీలో Indian origin teachers చాలా తక్కువ. అందునా తెలుగు వాళ్ళు మరీ తక్కువ. మేము నడిపే weekend తెలుగు బడుల teachers ని University of Sydney వారు ఇచ్చే Certificate/Diploma in Community Language Teaching Course కి నామినేట్ చేశాము. మాలో ఇంచుమించు అంతా ఈ కోర్సులు చేసినవాళ్ళమే. Teaching career లో మరీ ఆసక్తి ఉన్నవాళ్ళు Masters in Teaching చెయ్యవచ్చు, చేస్తున్నారు కూడా. కానీ వీళ్ళు public schools లో రెగ్యులర్ teachers గా చెయ్యరు ఎందుకంటే వీరంతా వేరే professions లో ఉద్యాగాలు చేస్తున్నారు. పైగా primary schools teachers గా చెయ్యాలంటే కూడా Masters in Teaching చెయ్యాలి.
తెలుగు background ఉన్న Public School Teachers అన్వేషణ నిరంతరం సాగుతోంది. తెలుగుకి public schools లో డిమాండ్ పెరిగితే కొందరు teachers ని India నుండి sponsorship మీద తెచ్చే అవకాశం లేకపోలేదు.

భవిష్యత్తులో తెలుగు బళ్ళను పెంచే ఆలోచన, అవకాశం ఉండా?

సిడ్నీలో కొత్త suburbs వెలుస్తున్నాయి. వాటిలో ఎంతోమంది యువ కుటుంబాలు స్థిరపడుతున్నాయి. వారందరికి తెలుగు భాషా మీద మక్కువ ఎక్కువగా కనిపిస్తోంది. తెలుగు వారు ఎక్కువగా స్థిరపడుతున్న సుబుర్బ్స్ లో తప్పక కొత్త బడులు పెడతాం. సంతోషించవలసిన విషయం ఏమంటే చాలామంది యువకులు తెలుగు నేర్పడానికి సిద్ధంగా ఉన్నారు. మా యాజమాన్యం తగిన ఏర్పాట్లు చెయ్యడానికి ఎప్పుడూ సిద్ధమే. మాకు ముఖ్యంగా కావలసిందల్లా పిల్లలు.

తెలుగు బళ్ళ నిర్వహణలో మీరు తీసుకున్న జాగ్రత్తలేంటి? రూపొందించుకున్న నిబంధనలేంటి?

తెలుగులో మనందరికీ తెలిసిన సామెత ఒకటి ఉంది. “చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి” అని. తెలుగు బడులు వారానికి ఒక్క సారి నడిపినా, నడిపే విధానం, తీసుకోవలసిన జాగ్రత్తలు ఇంచుమించు regular schools లాగానే ఉంటాయి. వాటిలో కొన్ని:
• బడితో సంబంధమున్న మా అందరికీ “Working with children” క్లియరెన్స్ ఉండాలి. ఇది NSW Govt మా క్రిమినల్ background చెక్ చేసి ఇస్తుంది. ఇది లేకుండా ఎవ్వరూ పిల్లలతో సంబంధం ఉన్న ఏ activity చేయించకూడడదు.
• మా teachers అందరూ First Aid training తీసుకోవాలి.
• Public liability insurance for all school activities కావాలి
• Attendance regular గా తీసుకోవాలి.
• Department of Education నుండి అప్పుడప్పుడు audit జరుగుతుంది.
• Teachers/Students వివరాలు confidential గా ఉంచాలి.
• Students చేసిన project work, వాళ్ళ photographs మేము parents’ permission లేకుండా ఎక్కడా ఉపయోగించకూడదు.
• Department of Education ఇచ్చే ఫండ్స్ కి audit జరుగుతుంది.

నిబంధనలకు వస్తే, మేము “Telugu Badi – Administrative Manual” తయారు చేశాము. అందులో అనేక వివరాలు, సూచనలు, నిబంధనలు పొందు పరిచాము. ఉదాహరణకి:
• Student Enrolment process & Enrolment Form with parent consent forms.
• Teacher’s selection process and Teacher Profile Form.
• Guidelines to start a new school
• Guidelines to apply for NSW Government funding and audit
• Guidelines to draft special project proposals for grants
• Guidelines to maintain Student Records
• Guidelines to nominate students to Minister’s Awards
• Guidelines to nominate School Ambassadors
• Guidelines to address parents’ concerns and escalation management
• Guidelines to test and evaluate students’ performance
• Guidelines to classroom management

ఇటీవల మేము school web information పోర్టల్ http://sydneytelugubadi.org/ విడుదల చేశాము. ఇక్కడ బడుల వివరాలు అందులో ఉంటాయి. రాను రాను మరిన్ని వివరాలు చేరుస్తాము. ఇది కాక school management కి సంబంధించిన web based system ఇంకొకటి ఉంది. ఇందులో బడికి, students కి, teachers కి సంబంధించిన details ఉంటాయి. ఇది కేవలం school staff కి మాత్రమే పరిమితం.

తెలుగు బళ్ళలో పిల్లలతో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?

మా motto “ఆడుతూ పాడుతూ తెలుగు నేర్చుకుందాం”. దీనికి తగ్గట్టుగానే పాఠాలతో పాటు కొన్ని traditional ఆటలు అడిస్తాం. వీటి ఉద్దేశ్యం పిల్లలని ఆకట్టుకోడంతో పాటు వాళ్ళ చేత తెలుగు పలికించడం. ఉదా. కబడ్డీ ఆడేటపుడు వేరు వేరు కూతలు కూయించడం “చెట్టుమీద దెయ్యం నాకేం భయ్యం” మొదలైనవి.
పిల్లలు పద్యాలు నేర్చుకుంటారు, skits చేస్తారు, dances చేస్తారు, news report చేస్తారు, projects చేస్తారు ఇలా ఏది చేసినా వాళ్ళ life కి సంబంధించినదై ఉంటుంది, పైగా తెలుగులోనే జరుగుతాయి. పిల్లలకు వారి బాల్యంలో కొన్ని మరపురాని క్షణాలను అందించాలన్నదే మా ప్రయత్నం.

స్థానిక ప్రభుత్వం మీకు ఎలాంటి సహకారాలు అందిస్తుంది? విద్యార్థుల మాతృభాషాలకు సంబంధించి ఆస్ట్రేలియాలో ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయీ?  
బడి పిల్లలు అసోసియేషన్ జరిపే ఉగాది, దీపావళి వేడుకల్లో perform చేస్తారు. NSW Premier’s Harmony Day event లోనూ, NSW Federation of Community Languages Schools events లోనూ పాల్గొంటారు.

మా బడులకు NSW Government నుండి అనేక విషయాల్లో మద్దత్తు లభిస్తుంది:
• మా బడి పిల్లలు ఒక్కొక్కరికి per capita grant లభిస్తుంది.
• Special Project గ్రాంట్ లభిస్తుంది.
• NSW public schools లో తెలుగు బడికి classrooms ఉచితంగా వాడుకోనిస్తారు.
• మా teachers కి “Community Language Teaching” లో certificate or diploma courses ఉచితంగా University of Sydney అందిస్తుంది.
• మా management staff కి “School Administration” లో training ఉచితంగా University of Sydney అందిస్తుంది.
• మా teachers ప్రతి సంవత్సరం NSWFCLS జరిపే Teachers’ Conference కి వెళ్ళవచ్చు. అక్కడ 150 పైగా వేరువేరు language groups ని కలిసే అవకాశం ఉంటుంది.
• ప్రతి సంవత్సరం మాకు NSW Premier’s Harmony Day function కి ఆహ్వానం వస్తుంది. Participation in this event makes us feel proud to be a part of a larger multi-cultural community of NSW. We feel even prouder when the names of our children are announced along with their ethnic group that is Telugu.
ప్రభుత్వ విధాలాలు చాలా అనువుగా ఉంటాయి. మన దగ్గరనుండి proposals ఏ మాత్రం reasonable గా ఉన్నా consider చేస్తారు. Local State MP లేదా Minister కి కలిసి సాధించుకోవచ్చు.
ప్రతి పౌరుడు వారి మాతృ భాష కాపాడుకోవాలి, తద్వారా వారి వారి మాతృ దేశాలతో సత్సంబంధాలు పెంపొందాలి అన్నది వారి ఆశయం. ఈ విషయంలో ఇటీవల ఒక అధ్యయనం చేసి “What are languages worth? Community languages for the future of New South Wales” అని ఒక research paper పబ్లిషింగ్ చేసారు. ఇది పబ్లిక్ domain లో ఉంది. వ్యాపారం, సత్సంబంధాలు గురించిన చాలా interesting వివరాలు అందులో ఉన్నాయి. Interest ఉన్న వారు చదవ వచ్చు. https://www.nswfcls.org.au/upload/image/2019/11/10/cc1b5c55-196f-44c6-acdc-8f4a671e035d.pdf
ఇక్కడ Chinese, Greek, Arabic వంటి పెద్ద communities, వారి వారి భాషలను HSC వరకు చదువుతారు. ఇటీవల భారతీయ భాషలు హింది, పంజాబీ, తమిళ్ లకు K-12 Framework తయారు చేశారు. తెలుగుకి కూడా చెయ్యమని NESA కి request పంపాము. మన తెలుగుకి అంత డిమాండ్ లేదు పైగా అది National Language కాదు. ఐనా ఈ సంవత్సరం మళ్ళీ ప్రయత్నం చేస్తాము.

తెలుగు బడి వార్షికోత్సవాల ఉద్దేశ్యం ఏంటి? వీటీకీ ఎవర్ని ఆహ్వానిస్తారు?

తెలుగు బడి వార్షికోత్సవాల ఉద్దేశ్యం తల్లిదండ్రులకు వారు ప్రతివారం పెట్టిన శ్రమ ఎలా ఫలించిందో చూపడం, పిల్లను encourage చెయ్యడం, కొత్త పిల్లలని ఆకర్షించడం, పిల్లల ప్రదర్శనలు, పిల్లలకు Certificates/Awards ప్రధానం మొదలైనవి. వీటికి తల్లిదండ్రులు, వారికి పరిచయమున్న (చిన్న పిల్లలున్న) వారి మిత్రులు వస్తారు.
మా ప్రోగ్రామ్స్ కి NSW Ministers, Local MPs, Local City Mayors/Counsellors, NSWFCLS President మొదలైన వాళ్ళు VIP guests గా వస్తారు. స్థానికంగా తెలుగు వారికి సంబంధించిన అనేక associations ఉన్నాయి. వాటి Presidents లేదా Secretaries ని ఆహ్వానిస్తాం.

ఈ పరిశోధన ముఖ్యంగా నేను వ్యక్తిగతంగా “తెలుగు పిల్లలకి ఎలా అందించాలి” అన్న దానిపై చేస్తున్నది. ఇక్కడ సమస్య పిల్లలు కారు, చెప్పే teachers కారు, పాఠ్యపుస్తకాలూ కావు, తెలుగు ఎంత/ఎలా చెబుతున్నాము కూడా కాదు. వీటికి సంబంధించిన సమస్యలకు పరిష్కారాలు ఏదో విధంగా కనుక్కోవచ్చు. అసలు సమస్యల్లా పిల్లలను బడికి తీసుకు రావలసిన తల్లిదండ్రులది. ఉదాహరణకి, ఒక area లో కొన్ని వందల తెలుగు కుటుంబాలు నివసిస్తున్నాయి. కానీ ఆ area లో మా తెలుగు బడికి కేవలం 40 మంది పిల్లలు మాత్రమే వస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. వీటన్నిటిని అధిగమించి తల్లిదండ్రుల దృష్టిలో “తెలుగు బడి” కి top priority తీసుకు రావాలి అన్నదే నా పరిశోధన.

విదేశాలలో పిల్లలకు తెలుగు నేర్పడం అన్నది కేవలం ఒక కుటుంబానికో, ఒక సమాజానికో సంబంధించినది కాదు. ఇది అందరికీ సంబంధించినది. భాష పోతే సంస్కృతి లేదు, సంస్కృతి పోతే మన గుర్తింపూ లేదు. వ్యక్తి గతంగా ప్రతి ఒక్కరు ఈ గుర్తింపు పోగొట్టుకుంటే, ఆ సమాజానికే అస్థిత్వం పోతుంది. అది పోతే మళ్ళా సంపాదించడం చాలా కష్టం. దీనికి నేను రెండు ఉదాహరణలు ఇస్తాను.
1. బ్రిటిష్ వారు 1879లో వేలాది మందిని భారతీయుల్ని అనేక ప్రాంతాలనుండి వ్యవసాయ కూలీలుగా ఎక్కడికి తీసుకు పోతున్నారో కూడా చెప్పకుండా Fiji లో దింపారు. వారికి ఒకరి భాష ఒకరికి తెలియదు. వారికి తెలిసిందల్లా వారు భారతీయులని. గత నూరేళ్లుగా తమకంటూ ఒక గుర్తింపుకావాలని ప్రయాసపడ్డారు. వారు మాట్లాడేది అన్ని భాషలు కలిసిన Fiji హింది (అది హింది లా వినిపిస్తుంది కానీ హిందీ కాదు). వారి సాంప్రదాయాలు ఎప్పుడో మనం వదిలేసిన ప్రాచీన హైదవ సాంప్రదాయాలు.
2. African Americans ఏ దేశంనుండి వచ్చారో తెలియదు. వారికి తెలిసిందల్లా వారు ఆఫ్రికన్లమని. తమకంటూ ఒక గుర్తింపుకావాలని ప్రయాసపడ్డారు. African American English (slang/accent) వేరు, సంగీతం వేరు, dance styles వేరు, జీవన విధానం వేరు.
ఈ రెండు ఉదాహరణల వల్ల తేలింది మన అస్థిత్వం పోగొట్టుకోడం సులభం. అది మళ్ళీ సంపాదించడం అసాధ్యం. ఈ రెండు ఉదాహరణలలో వారి వలసలపై వారికి ఏమాత్రం control లేదు, దుర్భర పరిస్తితుల్లో చాలా కాలం జీవించారు, స్వదేశాలతో వ్యక్తిగత సంబంధాలు తెగిపోయాయి. ఒక గుర్తింపు ఎందుకు అవసరమో అది పోగొట్టుకున్నవాడికే బాగా తెలుస్తుంది.
ఇప్పుడు Australia, America వంటి దేశాలకు మనం ఇష్ట పూర్వకంగా వలస వెడుతున్నాం, అక్కడి ప్రభుత్వాలు మన భాషా సాంస్కృతులను నిలుపుకుందుకు అన్నివిధాలా సహకరిస్తున్నాయి, మన కుటుంబాలతో నిత్యం సంపర్కంలో ఉంటున్నాం. మనం తెలుగుదనంతో జీవించవచ్చు. దీనికి పునాది రాయి తెలుగు భాష. భాషని పిల్లలకి స్వాభావికంగా (natural గా) అందించడం తల్లిదండ్రుల ప్రాధమిక బాధ్యత. ఇక్కడి పరిస్థితులవల్ల అది సాధ్యం కావడంలేదు. పిల్లలకు తెలుగు నేర్పడం అన్నది ఒక “Cooperative Endeavour” గా చేపట్టాలి. అందులో తల్లిదండ్రులు, teachers, సమాజం భాగస్వాములు (stakeholders) కావాలి. తెలుగు బడులు ఒక మాధ్యమం మాత్రమే. వాటి లక్ష్య సాధనలో అందరూ సమవంతులో పాలు పంచుకోవాలి. ఇక్కడి తెలుగు బడుల నిర్వహణలో stakeholders అందరికీ కొన్ని బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది.

కొత్త ఉపాధ్యాయులకు 3 వారాలు induction నిర్వహిస్తాము. ఆ 3 వారాలు వాళ్ళు experienced teachers తో పనిచేసి, classroom లో పిల్లలతో ఎలా వ్యవహరించాలి, classroom లో technology ఎలా ఉపయోగించాలి, security management, emergency procedures వంటి వివరాలు తెలియజేస్తాం. కొత్త Teachers కి textbook, computer equipment, First Aid Kit, మొదలైనవి ఉన్న “Teachers Kit” అందజేస్తాం.

ప్రతి వారం తెలుగు బడి 2 గంటలు 40 వారాలు నడుస్తుంది. ఈ తక్కువ టైమ్ లో పిల్లలను ఆకట్టుకుంటూ అన్ని బడులలో ఒకే విధంగా పాఠాలు చెప్పాలి. అందుకు మాకు ప్రతివారానికి ఏ క్లాసులో (తరగతిలో) ఏ పాఠం చెప్పాలో సూచించే “Lesson Plans” ఉంటాయి. కావలసిన charts, posters, పాఠాలు మొదలైనవి electronic గా ప్రాజెక్టు చేస్తాము. వాటివల్ల చాలా సమయం ఆదా అవుతుంది పైగా పిల్లల అందరి attention స్క్రీన్ పైనే ఉంటుంది. మధ్యలో 10-15 నిముషాల బ్రేక్ ఉంటుంది. సమయాన్ని సందర్భాన్ని బట్టి activities ని teachers ప్లాన్ చేస్తారు.

మానవుడన్నవాడు ఏదో కొత్తదనాన్ని వెతుకుతుంటాడు. ఆ అన్వేషణ పిల్లలలో కూడా ఉంటుంది. రోజూ రెగ్యులర్ గా వెళ్ళే school కన్నా వారానికోసారి ఆడే అటపై మక్కువ ఎక్కువ ఉంటుంది. అటువంటి మక్కువే పిల్లలలో కలిగించాలన్నదే బడుల లక్ష్యం. ఇది మేము తల్లిదండ్రుల మాటల్లో విన్నాం. “బడికి వెళ్లరా” నుంచి “బడిలో దింపు” వరకు వచ్చింది.
ఒక్కొక్క బడిలో 20 నుంచి 60 దాకా ఉంటారు. మొత్తం 11 classrooms నడుస్తాయి. ఒక్కొక్క classroom లో 10-15 మంది పిల్లలు ఉంటారు.

పిల్లలకు ప్రతి టర్మ్ లో tests ఉంటాయి. Annual Day నాడు మేము Achievement Certificates ఇస్తాము.
Department of Education వారు students కి “Acknowledgement of Participation” అనే సర్టిఫికేట్ ఇస్తారు. దీన్ని పిల్లల regular school principal ద్వారా వాళ్ళ school assembly లో ఇప్పించే ప్రయత్నంచేస్తాం.
ఇవి కాకుండా మంచి ప్రతిభ కనబరచిన పిల్లలను Minister’s Award కి నామినేట్ చేస్తాము.

ఇది regular schools కి సంబంధించిన విషయం. ఎక్కువ తెలుగు పిల్లలున్న ఏ school లో నైనా parents అంతా ఆ school Principal ని ముందు request చెయ్యాలి. తెలుగు చెప్పగలిగిన teacher అందుబాటులో ఉంటే తప్పక consider చేస్తారు. ఇటీవల Girraween Public School లో parents ఆ principal ని request చేశారు. అదృష్టవశాత్తు ఒక తెలుగు చెప్పగల teacher దొరికారు. మా తెలుగు బడి తరుఫున పుస్తకాలతో పాటు మా సహకారాన్ని తెలియజేసాము. 2020 లో ఆ school లో మన తెలుగు పిల్లలు తెలుగు నేర్చుకుంటారు. ఇలాగే వేరే public schools లో తెలుగు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.

దీనివల్ల తెలుగు curriculum కి official recognition వస్తుంది. పిల్లలు HSC వరకు తెలుగు subject తీసుకోవచ్చు. Public School లో తెలుగు ఉంటే, మన పిల్లలందరూ తెలుగు అక్కడే నేర్చుకోవచ్చు. ప్రత్యేకించి weekends లో తెలుగు బడికి రానవసరం లేదు.

బడి పిల్లలు Elementary stage వాళ్ళూ. వాళ్ళు సాహిత్యం దాకా రాలేదు. కానీ, సుమతి, వేమన, తెలుగు బాల, శ్రీ కృష్ణ శతక పద్యాలు నేర్చుకుంటారు. కంద, ఆ.వె, తే.గీ పద్యాలే నేర్చుకుంటారు.

మా బడులు తెలుగు అసోసియేషన్ నడుపుతుంది. ఇప్పటి వరకు మా బడులను ఉచితంగా నడుపుతున్నాము. పిల్లల తల్లిదండ్రులతోనే బడికి Direct గా సంబంధముంది. వారంతా బడికి అడిగిన సహాయం చేస్తారు.

బడికి NSW Department of Education నుండి రెండురకాల నిధులు వస్తాయి. 1. Per Capita Funding 2) special Project Fund. ఇవి కాక private corporations కొన్ని community projects ని సపోర్ట్ చెయ్యడానికి funds announce చేస్తాయి. వాటికి తగిన ప్రాజెక్టు ప్రపోజల్స్ submit చేసి కొన్ని నిధులు సేకరిస్తాము. వాటిని ఉపయోగించి books ప్రింట్ చెయ్యడం, computers మొదలైన కొనడం జరిగాయి.

ఆస్ట్రేలియాలో ప్రతి నగరంలో తెలుగు సంఘాలు ఉన్నాయి. అవి తెలుగు బడులను నడుపుతున్నాయి. ఈ సంఘాలు FTAA (Federation of Telugu Associations in Australia) లో సభ్యులు. FTAA తెలుగు common curriculum ని తయారు చేసి దాన్ని Australia లో అన్ని తెలుగు బడులలో ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తోంది. దానికి నేనే National Convener ని. ఈ curriculum గురించి పొట్టి శ్రీరాములు తెలుగు యునివర్సిటి (ITC) వారితో సంప్రదిస్తున్నాం. ఒక common curriculum తో Australia లో అన్ని బడుల మధ్య synergy పెరిగి విస్తరించే అవకాశాలు ఉంటాయి.

“అమ్మ భాష మాధ్యమం అవసరం లేదు” అనేకన్నా “ఆంగ్ల మాధ్యమం కూడా కావాలి” అంటే సమంజసంగా ఉంటుంది. ఇంగ్లిష్ వచ్చిన కొద్ది మంది పిల్లకి తెలుగు నేర్పడం ఎంతకష్టమో మాకు బాగా తెలుసు. అలాంటిది, ఇంగ్లిష్ రాని పిల్లలకు, ఏకంగా ఇంగ్లిషే మాధ్యమం అంటే ఈత రాని వాడిని సముద్రంలో పాడేసినట్లే అని నా అభిప్రాయం. ఇక్కడి పిల్లలకు తెలుగు రాకపోతే నష్టంలేదు కానీ అక్కడి పిల్లలకు చదువు రాకపోతే కలిగే నష్టం అనూహ్యం.

విదేశీయులు ఎవరిని కలిసినా “నేను Japanese”, “నేను German”, “నేను Russian” అని పరిచయం చేసుకుంటారు. మన సాటి భారతీయుల్ని కలిస్తే “నేను పంజాబీ”, “నేను గుజరాతీ”, “నేను ఆంధ్ర” అని వింటాం తప్ప నేను Indian అని ఎవ్వరూ చెప్పారు. అయితే ఇది తప్పా? ఎంతమాత్రం కాదు. ప్రతిదేశం యొక్క పేరు ఆ దేశ భాషాసాంప్రదాయాలతో ముడిబడి ఉంటుంది. అదే వారి అస్తిత్వం, పరిచయం. భారత దేశానికి వస్తే, ఇండియన్ అన్నా భారతీయుడిని అన్నా అవి మన citizenship ని సూచిస్తాయి తప్ప మన నిజమైన అస్తిత్వాన్ని సూచించవు. భారతదేశంలో విభిన్న భాషాసంస్కృతులు ఉన్నాయి. ప్రతివాళ్ళం ఏదో ఒక భాషా సాంప్రదాయాలకు చెందినవాళ్ళమే. అదే మన అసలైన పరిచయం. “నేను ఫలానా” అని చెప్పుకోడంలో ఆ భాషా సాంప్రదాయాలకు తమ మమేకాన్ని తెలియజెప్పడమే. తెలుగు రాకపోతే మన పిల్లలు నేను “తెలుగు వాడిని” అని చెప్పుకోలేరు. మనం ఏ దేశ పౌరులమైనా “Indian-Australian”, “Indian-Canadian”, “Indian-American” అంటూ మనకి ఒక “tag” ఉంటుంది. తరాలు గడిచినా అది చాకలి గుర్తులాగ ఎన్నటికీ పోదు. ఈ సందర్భంలో వేమన గారి “ఎలుక తోలు దెచ్చి ఎందాక ఉతికిన” అనే పద్యానికి కొత్త అర్థం చెప్పుకోవాలి.

రసం పిండేసిన ఏ పండైనా అది పిప్పే! మాతృభాష రాని ఏ జాతి వాడైనా ఒక అనాముకుడే!

—***—

Shopping Cart