My mother tongue Telugu

నా మాతృ భాష తెలుగు

[gspeech type=circle]

భావము మనసులో కలిగే ఒకానొక నిర్ధిష్టమైన స్పందన. దానిని యదాతథంగా వ్యక్తపరిచే సాధనమే పుట్టుకతో మనకు తెలిసిన భాష. అదే మాతృ భాష. అది ఏ భాషయినా కావచ్చు. ఒక భావానికి, దాని వ్యక్తీకరణకు పరస్పర సంబంధం కేవలం మాతృభాషలోనే సహజంగా సాధ్యమవుతుంది.
కొన్ని పదాలు ఒకేలాగా అనిపించినా, వాటి వెనుక హృదయాంతరాల్లోని స్పందన విభిన్నంగా ఉంటుంది.
ఉదా. సంతోషం–ఆనందం, బాధ-విషాదం, ప్రేమ-ఆత్మీయత, కరుణ-జాలి. వాటిని భావ ఛాయలు (shades of meaning) అంటారు.
అసలు meaning అనే పదానికి “శబ్దార్థము” కన్నా “భావార్థము” అనేదే సరైన పదము. అంటే, ఒక పదాన్ని విన్నపుడు, ఆ పదాన్ని ప్రయోగించిన వ్యక్తి యొక్క మనోభాన్ని ప్రతిఫలింపజేసే సరైన అర్థాన్ని గ్రహించగలగాలి.
తెలుగు యాసలు
తెలుగు భాష ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మాట్లాడే భాష. తెలుగు భాష వేరు వేరు ప్రాంతాల్లో రక రకాల యాసలతో మాట్లాడుతారు. కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలలో వాడే తెలుగు యాసలు విభిన్నంగా ఉంటాయి. ఈ మూడు యాసలను ముఖ్యంగా పరిగణించవచ్చు.
చారిత్రాత్మక కారణాల వల్ల తెలంగాణలో తెలుగు భాషపై ఉర్దూ ప్రభావం ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల చుట్టూ ఒరిస్సా, ఛత్తీస్ గడ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల సరిహద్దు గ్రామాలలో తెలుగువారితో పాటుగా పక్క రాష్ట్ర ప్రజలు నివసించడం సహజం. తద్వారా, పక్క భాషల ప్రభావం, అక్కడి తెలుగు యాస మీద, పదాల వాడుక మీద ఎక్కువగా కనిపిస్తుంది.
ఉదా. “పప్పు” అనే పదానికి బదులుగా కన్నడ ప్రభావిత ప్రాంతాలలో “బేడ” అని వాడుతారు.
సమానార్థాన్నిచ్చే అనేక పదాలు (synonyms) తెలుగులో చాలా ఉన్నాయి. అలాగే, అనేక అర్థాలనిచ్చే పదాలు (homonyms) కూడా తెలుగులో చాలా ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మాటను ఒక్కొక్క అర్థంలో వాడటము ప్రసిద్ధము. అదే మాట వేరే ప్రాంతంలో ఆ అర్థంలో వాడుకలో ఉండక పోవచ్చు. అటువంటి వాటిని దేశీయాలు లేదా మాండలికాలు అంటారు.

ఉదా. 

  • “chutney” అనే పదానికి “ఊరుబిండి” అని రాయలసీమలో అంటే, “పచ్చడి” అని కోస్తాలో అంటారు.
  • “hurry” అనే పదానికి కోస్తాలో “తొందర” అని అంటే “ఇబ్బంది” అని రాయలసీమలో అంటారు. కానీ, కోస్తాలో “ఇబ్బంది” అనే పదాన్ని “inconvenience” అనే అర్థంలో వాడుతారు.
  • “job” అనే పదానికి “కొలువు” అని తెలంగాణలో అంటే, “ఉద్యోగం” అని కోస్తాలో అంటారు.
  • “nuisance” అనే పదానికి “ఆగమాగం” అని తెలంగాణలో వాడితే, “అల్లరి” అని కోస్తాలో అంటారు.

తెలుగేతర భాషలు
ఈ యాసా భేదాలే కాకుండా, మన తెలుగు ప్రాంతాల్లో గోండి, లంబాడీ, చెంచు వంటి వేరు వేరు భాషలు అనేకం వాడుకలో ఉన్నాయి. ఈ భాషలను మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఆటవిక ప్రాంతంలో (చెంచు మొ.) నివసించే వారు లేదా వలస జీవనం నడిపే వారు (లంబాడీ మొ.).
ఆయా ప్రాంతంలనుండి చదువుకున్న వాళ్ళు ఉద్యోగాల కోసం పట్నాలకు వలస పోవటం తప్పదు. అలాగే, గృహ నిర్మాణం, రహదార్ల నిర్మాణం, వ్యవసాయం వంటి రంగాలలో కార్మికులుగా పనిచేసే ప్రజలు, ఎక్కడ పని దొరికితే అక్కడికి వలస పోక తప్పదు. కొందరు వారి ఆటవిక భూములను mining, irrigation వంటి projects లలో కోల్పోయి వేరే ప్రాంతాలకు తప్పనిసరిగా వలస వెళ్ళారు.
వెళ్ళిన చోట వారు తెలుగులోనే మాట్లాడ వలసిన అవసారం ఉండటంవల్ల నైతేనేమి, వారి భాషలో మాట్లాడే అవకాశం లేక పోవడంవల్ల నైతేనేమి, ఆయా భాషలు రాను రాను కనుమరుగవుతున్నాయి. వీటిలో కొన్ని భాషలలో రామాయణం, భారతం వంటి గ్రంథాలు, పాటలు, కథలు, జానపద గేయాలు మొదలైన సాహిత్యం ఎంతో ఉంది. తెలుగు రాష్ట్రాలలో మనకు వినిపించే అటువంటి ఇతర భాషల గురించి తెలుసు కుందాము.

మాతృ భాష ఆవశ్యకత

మనలో చాలామందికి వ్యాసాలు, కథలు రాయడంపై ఆసక్తి ప్రస్తుతానికి ఉండకపోవచ్చు. కానీ, మనందరము జీవితంలో అనేక విషయాలు చదివి ఉంటాము, నేర్చుకుని ఉంటాము లేదా అనుభవించి ఉంటాము. Maslow పేర్కొన్నట్లుగా, మనం నిజ జీవితంలోను, వృత్తి రీత్యా రకరకాల అవసరాలను మనకు తెలియకుండానే తీర్చుకునే ప్రయత్నం చేస్తుంటాము. కాల క్రమమంలో “Self-actualization” స్టేజ్ కి చేరుకుంటాము. మన జీవిత అనుభవాలను ఇతరులతో పంచుకోవాలని, మన చుట్టూ ఉన్న వారికి, మన అస్తిత్వాన్ని తెలిపే రీతిలో ఏదైనా చేయాలనే తపన కలగడం స్వాభావికం. అది ఒక కార్య రూపంలో కావచ్చు లేదా, రాత రూపంలో కావచ్చు. అటువంటి తపన హృదయాంతరాల్లో నుండి పుడుతుంది. అది క్రియా రూపం దాల్చాలంటే, దానికి మాతృభాష అత్యంత అనువైనది.

అందుకే, మాతృభాషను మరువకండి, మాండలీకాలు తెలుసుకోండి, భాషను మీ వంతుగా పెంపొందించండి.

Shopping Cart