కోవిడ్ మహమ్మారి
మానవుల క్లేశాలకు మూడు హేతువులు. అవి ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికములు. ఆధ్యాత్మికములు శారీరక, మానసిక క్లేశాలు, ఆధిభౌతికములు మానవుల వల్ల కలిగేవి, ఆధిదైవికములు ప్రకృతి వల్ల సంభవించేవి.
నాకు ఊహ తెలిసినప్పటినుండి అనేక క్లేశాలను చవి చూశాను. ఆధ్యాత్మిక క్లేశాలు మినహాయిస్తే, ఆధిభౌతిక, ఆధిదైవిక ఘటనలు అనేకం నాకు చాలా గుర్తున్నాయి.
నేను 6వ తరగతిలో ఉండగా “రండి, ఇవ్వండి మన రక్షణ నిధికి” అంటూ పాడుతూ మాచర్ల వీధులలో తిరుగుతూ చైనా యుద్ధానికి చందాలు నేకరించడం నాకింకా గుర్తు. నాటి నుండి నేటి వరకు జరిగిన యుద్ధాలు, పెద్ద పెద్ద ఆందోళనలు, విశాఖ ఉక్కు ఉద్యమం, ఎమర్జెన్సీ మొదలైనవి ఆధి భౌతిక క్లేశాలు.
తుఫానులు, సునామీలు, భూకంపాలు మొదలైనవి ప్రజలని ఎంతగానో కలవర పరచాయి. అవి ఆధి దైవికాలు.
ఇటువంటి దుర్ఘటనలు అనేక రకాలుగా మనలకు కష్ట పరిచాయి, నష్ట పరచాయి. కానీ ఇప్పటివరకూ ఏది కూడా “మన దాకా వచ్చి ప్రాణ సంకటం కలిగిస్తుంది” అని మనం ఎవ్వరమూ భావిచి ఉండమని నా ఊహ.
గత 20 నెలలకు పైగా ప్రపంచమంతటా వ్యాపించి అపార ప్రాణ నష్టం కలిగిస్తూ ప్రజలను గడ గడ లాడిస్తున్న కోవిడ్ -19 మహమ్మారి ఆధిభౌతికమా? (caused by man) లేక ఆధిదైవికమా? (caused by nature) అని కూడా నిర్ధారించలేని స్థితిలో ఉంది మానవాళి. కానీ దీనివల్ల మనందరికీ ఒక విధమైన భీతిని కలిగించింది.
ప్రతి కుటుంబంలోనూ ఎవరో ఒకరినో లేదా బాగా తెలిసిన వారినో ఈ మహమ్మారి “పొట్టన పెట్టుకుంది” అంటే అతిశయోక్తి కాదు.
మన వాళ్ళని రక్షించుకోవాలనే ఆశ ఎవరికి ఉండదు? అప్పులు చేసి తమ వారికి వైద్యం చేయించారు అందరూ. చాలా మంది బతికి బట్ట గట్టి బయట పడ్డారు, కొందరు ఇంటికి తిరిగి రాలేదు. ఏది ఏమైనా ఇంచుమించ అన్ని కుటుంబాలు ఆర్ధికంగా చితికి పోయాయి.
అదృష్ట వశాత్తు ఆస్ట్రేలియాలో అన్ని ప్రభుత్వాలూ, అంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, కఠినమైన నిర్ణయాలు సకాలంలో తీసుకోవడం వలన, ప్రజలు నిబంధనలు పాటించడం వలన ప్రాణ నష్టం ఎక్కువగా జరగ లేదనే చెప్పాలి.
ఎక్కడి వారక్కడే ఇంటికి పరిమితమైనందువల్ల, ఇళ్ళకు రాక పోకలు, పార్టీలు, విహారయాత్రలు మొదలైనవి ఆగిపోయాయి, ఖర్చులు తగ్గాయి. ఒక్క whatsapp messages ద్వారా తప్ప ఫోన్ కాల్స్ కూడా ఎక్కువగా లేవు. ఫలానా పని చేయడానికి టైమ్ దొరకడం లేదు అనే వారికి ఆ వంక పెట్టే అవకాశం లేకుండా రోజులో ఇప్పుడు తరగనంత టైమ్ ఉంటోంది.
గృహ నిర్బంధాల వల్ల గత ఏడాదిగా ఏమైనా కోల్పోయామా అంటే, “ఏమి లేదు” అనే అనాల్సి వస్తోంది. పెళ్ళి, పేరంటం, అమ్మ-నాన్నలను చూడటం, విహార యాత్రలు వంటివి తప్ప, మిగిలిన social వ్యవహారాలలో మన నిమగ్నత ఎంత అనవసరమో తెలిసి వచ్చింది.
మహమ్మారి మనకు శుచి శుభ్రతలను తిరిగి నేర్పింది. అలాగే అనవసరమైన పోకడలతో కాలాన్ని, ధనాన్ని ఎలా వ్యర్ధం చేసుకుంటున్నామో చూపింది.
అనేక దేశాలలో కోవిడ్ టీకాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఆస్ట్రేలియా 80% టీకాల స్థాయీని చేరుకుంది. నిర్బంధనల నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాము.
2022 సవత్సరంలో ఈ మహమ్మారి నుండి ప్రపంచమంతటికి పూర్తి విముక్తి కలుగుతుందని ఆశిద్దాం.
సర్వే జనః సుఖినో భవంతు.