Sankara Vijayamu

సంక్షిప్త శంకర విజయము

ది. 12-05-2024 శ్రీ వేద గాయత్రీ పరిషత్ నిర్వహించిన శంకర జయంతి వేడుక సందర్భంగా చేసిన ప్రసంగము

[gspeech type=circle]

శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కారుణాలయమ్ |
నమామి భాగవత్పాద శంకరం లోక శంకరమ్ ||


భాగవత్పాద శంకర జయంతి సందర్భంగా ఈ రోజు శ్రీ వేద గాయత్రీ పరిషత్ సభ్యులందరం కులుసుకోవడం, శంకరుల జీవిత చరిత్ర మరొకసారి తలచుకోవడం మనందరి అదృష్టం.
శంకరులు భారతదేశ ఆధ్యాత్మిక ముఖచిత్రాన్ని గణనీయంగా తీర్చిదిద్ది, వేదాంత తత్వవేత్తలందరిలో తలమానికముగా వెలసిన వారు. వారి జీవిత చరిత్ర మనదరికీ తెలిసినా, మరొక్క సారి పునశ్చరణ చేయడం నా అదృష్టంగా భావిస్తూ, వారి జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను.
శంకరులు కేరళ లోని కాలడి గ్రామంలో 788 సంవత్సరంలో జన్మించారు. 2018 లో నాకు కాలడిలో వారి జన్మస్థానాన్ని దర్శించే అవకాశం దక్కింది.
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు, శంకరులు చిన్నతనం నుండే అసాధారణ తెలివితేటలు ప్రదర్శించారు. రెండేళ్ళకే సంస్కృత భాషలో మాట్లాడటం, వ్రాయటం నేర్చారు. నాలుగేళ్ళకు నాల్గు వేదాలను పఠనం చేశారు. వారి తల్లి ఆర్యాంబ వారికి వేదాలు, ఉపనిషత్తులు బోధించడంలో కీలక పాత్ర పోషించారు.
పన్నెండేండ్ల వేయసుకి సన్యసించి, ఇల్లు విడిచి తన గురువులు శ్రీ గోవిందపాదాచార్యులను ఆశ్రయించారు. గురువుల ఆదేశం మేరకు శ్రీ విష్ణు సహస్ర నామావళికి భాష్యం రచించి, భాష్య రచనకు శ్రీకారం చుట్టారు.

ఆయన కొందరు శిష్యులను కూడగట్టి భారతదేశం అంతటా ఆధ్యాత్మిక శాస్త్రాలను పునఃస్థాపించే బృహత్కార్యాన్ని ప్రారంభించారు. తర్వాతి రెండు దశాబ్దాల్లో ఆసేతు హిమాచల పర్యంతం కాలి నడకన ప్రయాణంచేసారు. అనేక గ్రంధ రచనలు, భాష్య రచనలతో పాటు పండితులతోను, తత్వవేత్తలతోను వాదించి అద్వైత సిద్ధాంతాన్ని నిరూపించారు. భారతావనిలో నాస్తిక వాదాన్ని నిర్మూలించారు.
శంకరులు అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని విశదీకరించి, ద్వైత ప్రపంచము యొక్క వాస్తవికత అద్వైతము అని సహేతుకంగా నిరూపించారు.
ప్రాచీన అద్వైత వేదాంత బోధనలను మేళవించి, ఉపనిషత్తుల మౌలిక భావాలను స్పష్టం చేశారు. వీరు రచించిన ప్రస్తానత్రయ భాష్యములు అద్వైత సాధనకు ప్రామాణిక గ్రంధములు. వీరి స్వీయ రచనలలో వెలువడ్డ వివేకచూడామణి వంటి ప్రకరణ గ్రంథములు జ్ఞానమార్గ సాధకులకు చుక్కాని వంటివి. వీరి నోట అలవోకగా వెలువడ్డ స్తోత్ర రాజములు అద్వైత భావ గర్భితములు, అబాల గోపాలం పాడుకుని తరించదగ్గవి.
శంకరాచార్యుల కృషి జ్ఞానమార్గ పరమైన అద్వైత వేదాంతాన్ని దాటి విస్తరించింది. ఆయన కాలంలో ప్రాచుర్యంలోనున్న అనేక మతాలను 1. వైష్ణవము, 2. శైవము, 3. గాణాపత్యము, 4. స్కాందము, 5. సౌరవము, 6. శాక్తేయము అని ఆరుగా సంశ్లేషణ చేసి షణ్మాత స్థాపకుడయ్యారు.
శంకరులు సన్యాస జీవన విధానానికి ప్రాధాన్యమిస్తూ దశనామి సంప్రదాయమును స్థాపించారు. వారి బోధనలను వ్యాప్తి చేయడానికి శృంగేరి, పూరీ, ద్వారకా, జోషీమఠ్ క్షేత్రాలలో నాలుగు మఠాలను స్థాపించారు. శిష్య పరంపర ద్వారా ఆదిశంకరుల బోధనాల ప్రభావం ఈనాటికీ కొనసాగుతూనే ఉంటుంది.
సంక్షిప్తంగా చెప్పాలంటే, ఆదిశంకరుల ప్రతిభావంతమైన రచనలు సాధకులకు, పండితులకు కలకాలం స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఉదహరిస్తాను.
కనకధారా స్తోత్రము
ఒకనాడు శంకరులు భిక్షాటనకు వెళ్ళి “భావతీ భిక్షాందేహి” అని అడిగితే ఆ ఇంట్లో పేదరాలు “ఏమీ లేదు నాయనా” అని దీనంగా అంటుంది. దానికి “ఏదో ఉంటుంది వెతుకమ్మా” అంటారు శంకరులు. వెతకగా ఒక ఎండు ఉసిరికాయ దొరుకుతుంది. ఖిన్నురాలై దాన్ని శంకరులకు ఇస్తుంది. ఆమె దుస్థితికి చలించిన శంకరులు లక్ష్మీదేవిని స్తుతించారు. ఆ స్తోత్రానికి ప్రతిస్పందనగా, లక్ష్మీదేవి పేద మహిళ ఇంటిని బంగారు ఉసిరి పండ్లతో ముంచెత్తింది.
ఈ అద్భుత సంఘటనకు ఈ స్తోత్రమే కారణం. ఆనాటినుంది అది ‘కనకధారా స్తోత్రము‘ అనే పేర ప్రసిద్ధికెక్కింది.

నమోఽస్తు దేవ్యై భృగునందనాయై; నమోఽస్తు విష్ణోరురసిస్థితాయై ।

నమోఽస్తు లక్ష్మ్యై కమలాలయాయై; నమోఽస్తు దామోదరవల్లభాయై ॥ 14 ॥

 

ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే, ఆ పేదరాలిని చూసిన వెంటనే భిక్ష అడగకుండా ఆవిడను అనుగ్రహించవచ్చుకడా?
దానికి సమాధానం: ఆవిడకు గతజన్మలో ఎన్నడూ దానం చేయాలనే బుద్ధి పుట్టలేదుట. ఎవరికీ దనం చేయలేదుట. దానం ఇస్తే దాని ఫలితం ఏదో ఒకనాడు మనలను కాపాడుతుంది. ఈ జన్మలో దానం ఇద్దామన్నా ఏమి లేదు! అందుకే ఆమెని ముందుగా దానం ఇచ్చేలా శంకరులు “వెతికి చూడమని” సూచిస్తారు.

ఇదే విధమైన సన్నివేశాం ద్వారకలో కుచేలుడు శ్రీ కృష్ణుని దర్శించినపుడు తారసపడు తుంది. కుచేలుడు కూడా గత జన్మలో దానం చేయలేదు. ఆటుకులు ఉత్తరీరంలో ఉన్న తనంత తానుగా సిగ్గుతో ఇయ్యలేదు. అందుకే, శ్రీ కృష్ణుడే చొరవతీసుకుని వాటిని గ్రహిస్తాడు. అ తర్వాతనే శ్రీ కృష్ణుడు అనుగ్రహిస్తాడు.

ఈ రెండు ఉదాహరణలు మనలను దాన గుణం పెంపొందించుకోవాలని ప్రబోధిస్తున్నాయి.

భారతీయ తర్కశాస్త్రం
భారతీయ తర్కశాస్త్ర ప్రాథమిక సూత్రాలు జ్ఞానము (knowledge) యొక్క ప్రామాణికతను విశ్లేషించే ఒక క్రమబద్ధమైన పద్ధతిని సూచిస్తాయి. ఇవి

  • శాస్త్ర వాదనలో క్రమశిక్షణకు
  • హేతుబద్ధమైన చర్చకు
  • అపోహల నివారణకు
  • సత్యాన్ని నిర్ధారించుటకు

సహాయపడటానికి, మార్గనిర్దేశం చేయడానికి రూపొందించబడ్డాయి.
ప్రమాణము (epistemology): ఇది జ్ఞానాన్ని అనుభవము (చెల్లుబాటు) చేసుకునే సాధనాన్ని సూచిస్తుంది. ఆ సాధనాలు ప్రత్యాక్ష ప్రమాణము (direct perception), అనుమాన ప్రమాణము (inference), ఉపమాన ప్రమాణము (comparison) మరియు శాస్త్ర/శబ్ధ ప్రమాణము (verbal testimony) వంటివి.
పూర్వ పక్షం మరియు అపర పక్షం: వాది యొక్క (initial points) ప్రారంభ వాదనలకు పూర్వ పక్షం అని, ప్రతివాది యొక్క (counterarguments) విమర్శలకు అపర పక్షం అని పేర్లు. ఇవి ఇద్దరి మధ్య చర్చకు ఆధారం.
తర్కము: ఇది తార్కిక శాస్త్రం (dialectics) యొక్క ప్రక్రియ. దీనిలో ఒక నిర్ణయానికి రావడానికి ప్రశ్నించడం మరియు పరి ప్రశ్నించడం ఉంటుంది.
హేతు: వాదనకు ఆధారమైన కారణం (references).
సిద్ధాంతం: చర్చల ముగింపు తరువాత స్థాపించబడ్డ సిద్ధాంతం (established doctrine).

ఆధ్యాత్మికత 

పుట్టినప్పటినుండి మనం ఆధ్యాత్మిక వాతావరణంలో పెరిగాము. మన ఇంట్లో పూజలు, వ్రతాలు, నోములు, పెళ్ళిళ్ళు, గ్రామంలో జరిగే ఉత్సవాలు, జాతరలు, గుడిలో అర్చనలు, భజనలు, తీర్థయాత్రలు ఇలా అనేక విధాలుగా ఆధ్యాత్మికత మన జీవితాలతో ముడిపడి ఉంది.
మనలో కొందరికి గుడికి వెళ్ళడం, భక్తి పాటలు వినడం లేదా పాడుకోవడం పరిపాటి. మరికొందరు నిత్య పూజలు చేస్తారు. ఇంకొందరు తీవ్ర ఉపాసనలు కూడా చేస్తారు. అలాగే ఇంకొందరు యోగము లేదా ధ్యానము చేస్తారు.

వీటన్నిటిలోనూ, మనకు తెలిసినా తెలియకపోయినా, జగద్గురువులు శ్రీ శంకర భాగవత్పాదులు రచించిన శ్లోకాలు, స్తోత్రాలు నిత్యం వాడుతూనే ఉంటాము. శంకరులు మానవ జాతిపై అపార కరుణతో విస్తారమైన వాఙ్మయాన్ని రచించారు. వారి రచనలు ఆబాల గోపాలానికి, ఏ స్థాయి వారికైనా, అనువుగా అందుబాటులో ఉండేలా ఉంటాయి.

వారి రచనలు ముఖ్యంగా 3 వర్గాలుగా విభజించవచ్చు. 1. శ్లోకములు, స్తోత్రములు; 2. ప్రకరణ గ్రంథములు 3. భాష్యములు.

ఈ మూడు రకాల రచనల ప్రయోజనానాలి కొంత తెలుసుకుందాము.

శ్లోకములు, స్తోత్రములు 

శ్రీ శంకరులు అందరు దేవతలను స్తుతిస్తూ అనేక శ్లోకములు, స్తోత్రములు రచించారు.
బ్రహ్మమురారి సూరార్చిత లింగం – నిర్మల భాసిత శోభిత లింగం |
జన్మజ దుఃఖ వినాశక లింగం – తత్ప్రణమామి సదాశివ లింగమ్ ||

అని మనం విన్నామంటే అది శంకరుల “లింగాష్టకమ్” నుండి.
గంగా తరంగ కమనీయ జటాకాలాపం – గౌరీ నిరంతర విభూషిత వామభాగమ్ |
నారాయణ ప్రియ మనంగమదాపహారం – వారాణసీ పురపతిం భజ విశ్వనాథమ్ ||

అని మనం విన్నామంటే అది శంకరుల “విశ్వనాథాష్టకమ్” నుండి.
“నమో భూత నాథ నమో దేవ దేవ – నమో భక్త పాల నమో దివ్య తేజా”
సత్య హరిశ్చంద్ర సినిమాలో ఈ పాట మీరు వినే ఉంటారు. దీనికి ముందు ఒక శ్లోకం ఉంటుంది. అది
హే చంద్రచూడ మదనాంతక శూలపాణే – స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో |
హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే – భూతాధిప ప్రమథనాథ గిరీశ చాప ||

ఇది “శ్రీ శివనామావళి” స్తోత్రం లో మోదటి రెండు శ్లోకాలలో మొదటి అర్థ భాగాలు. ఇలా శంకరుల రచనలను సందర్భోచితంగా మన సినీ రచయితలు తమ రచనలలో వాడుకున్నారు. దీనికి కారణం, శంకరుల రచనాలలోని పద ఔచిత్యము, గాంభీర్యము, శ్రావ్యతలే కారణం.

పురుషార్థాలు
మానవుడు ఏది చేసినా ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించే చేస్తాడు. ప్రయోజనం లేకుండా పిచ్చివాడు కూడా రాయి విసరడు. మానవుడు ఆశించే ప్రయోజనాలను “పురుషార్థాలు” అంటారు. పురుషార్థాలు అంటే మానవుడు “కోరదగినవి” అని అర్థం. వీటిని నాలుగుగా (4) విభజించారు మన ఋషులు, అవి ధర్మ, అర్థ, కామ, మోక్ష పురుషార్థాలు.
ధర్మ పురుషార్థం – పాప పుణ్యాలను విమర్శించి దర్మ బద్ధంగా ప్రవర్తించడం దీని లక్ష్యం.
అర్థ పురుషార్థం – ధన, కనక వాస్తు వాహనాదులను సంపాదించే నిమిత్తం మనం చేసే ప్రయత్నాలు
కామ పురుషార్థం – సంతాన ప్రాప్తికి, సంసార సుఖానికి చేసే ప్రయత్నాలు కామ పురుషార్థాలే. అవే కావు, ఒక వ్యక్తి తన స్వప్రయోజనాలకు మాత్రమే (Only for self-gratification) చేసే పనులు కూడా కామ పురుషార్థాల క్రిందికే వస్తాయి.
ఇతరులకు హాని కలగకుండా ధర్మ బద్ధంగా అర్థ, కామ పురుషార్థలను పొందడం శాస్త్ర సమ్మతం.
ధర్మ, అర్థ, కామ పురుషార్థలు మూడింటిని కలిపి “త్రివర్గము” అంటారు.
మోక్ష పురుషార్థం – మానవుడు తన నిజస్వరూపము “సచ్చిదానంద బ్రహ్మము” అని తెలుసుకుని, జన్మ రాహిత్యాన్ని లేదా కైవల్యాన్ని పొడుటకు చేసే ప్రయత్నము మోక్ష పురుషార్థం.
దీనిని “అపవర్గము” అంటారు.

కర్మలు
శాస్త్రం విధించిన కర్మలు మూడు రకాలు. అవి క్లుప్తంగా నిత్య, నైమిత్తిక, కామ్య కర్మలు. త్రివర్గానికి చెందిన ప్రయత్నాలు అన్నీ ఈ మూడింటిలో చేరిపోతాయి. నిత్య, నైమిత్తిక, కామ్య కర్మలు కానివాటిని శాస్త్రం నిషేధించింది. అట్టి వాటిని ఎన్నడూ చెయ్యరాదు.
మీమాంస
మీమాంస అంటే వేదానికి తాత్పర్యమేమిటీ? అనే విమర్శ. ఇది పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస అని రెండు రకాలు. పూర్వ మీమాంసకులు ధర్మమే ప్రధానమని వాదిస్తే, ఉత్తర మీమాంసకులు మోక్షమే ప్రధానమని వాదిస్తారు.
శంకరులు మోక్షమే ప్రధానమని, “ఏకమేవా అద్వితీయం” అన్న వేదవాక్కును సహేతుకంగా నిరూపించిన అద్వైతాచార్యులు. దేశం నలు మూలలా తిరిగి, పండితులను తమ అద్వైత వాదంతో గెలిచి, కర్మసిద్ధాంతాన్ని ఖండించి దిగ్విజయం సాధించిన “బ్రహ్మ వాది”. వీరు సర్వజ్ఞ పీఠాన్ని అధిష్ఠించిన మహా జ్ఞాని.
వీరి రచనలలో అద్వైత భావం, జీవుడు-జగత్తు-ఈశ్వరుడు ల అభేధ భావం తొణికిసలాడుతుంది. సాధారణ స్తోత్రంగా పాడుకునే వాటిలో కూడా జీవేశ్వర అభేదం చూపుతారు. ఉదా. శివమానస పూజా స్తోత్రంలో
రత్నై కల్పిత మాసనం హిమజలై – స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదా – మోదాంకితం చందనమ్ |
జాతీ చంపక బిల్వ పత్ర రచితం – పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దాయానిధే పశుపతే – హృత్కల్పితం గృహ్యతమ్ ||

అని పూజోపచారాలతో మొదలు పెట్టి, 4వ శ్లోకం లోకి వచ్చేసరికి మన నిజ జీవితంలో చేసే ప్రతి పని శివారాధనలో భాగంగా ఎలా దర్శించాలో వివరించారు.
ఆత్మాత్వం గిరిజా మతిః స్సహచరాః – ప్రాణ శ్శరీరం గృహం
పూజాతే విషయోపభోగ రచనా – నిద్రా సమాధి స్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణ విధిః – స్తోత్రాణి సర్వాగిరో
యద్యత్కర్మ కరోమి తత్త దఖిలం – శంభో తవారాధనమ్ ||

ఇక్కడ తెలుసుకో వలసిన విషయం ఏమిటంటే, మనం ఏపని చేస్తున్నా దాన్ని శివార్పణ బుద్దితో చెయ్యాలి అని.
ఆత్మాత్వం = నేనే నీవు; గిరిజా మతిః = పార్వతియే నా మనసు
అనే ఈ రెండు పదాల్లోనే శివ-శక్తులు కాక “నేను” అనేది వేరుగా లేదు అని చెపుతారు.
బ్రహ్మానుభావానికి ఎవరు అర్హులు?
మానవుడుగా పుట్టిన ప్రతి వ్యక్తి బ్రహ్మానుభావానికి వారసుడే! కానీ, వారికి సద్గురు కృప ఎంతైనా అవసరము. గురువుని బ్రహ్మ విద్య బోధించమని కోరే ముందు, విద్యార్థి వివేకము Discrimination, వైరాగ్యము Renunciation, షట్సంపత్తి Six Virtues, ముముక్షుత్వం Longing for liberation అనే ఈ నాలుగు గుణాలు కలిగి ఉండాలి.
షట్సంపత్తి అంటే శమ, దమ, ఉపరతి, తితీక్ష, సమాధాన మరియు శ్రద్ధ. వీటి వివరాలు మనం ఇక్కడ చర్చించడంలేదు.
[(a) శమ: control of the mind; (b) దమ: control of the senses; (c) ఉపరతి: equanimity of mind; (d) తితీక్ష: forbearance; (e) సమాధాన, concentrating the mind on Truth; and (f) శ్రద్ధ: faith in the teacher and scriptures.]
అభ్యాసంలో ప్రకరణ గ్రంధముల పాత్ర:
బ్రహ్మ విద్యను అభ్యసించే ముందు, జీవ-జగత్తు-ఈశ్వర అంటే ఏమిటి? అన్న విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
ఈ విషయాన్ని ఉపనిషత్తులు, భగవద్గీత అనేక రీతులలో చర్చించినా, అవి సాధకులకు అంతుపట్టవు.
ఈ విషయాలను మూలాల నుండి తెలుసుకోవడానికి శంకరుల “వివేక చూడామణి” అనే గ్రంథాన్ని సాధకులు ముందుగా అభ్యసించాలి. వివేక చూడామణి అంటే Crest Jewel of Discrimination. ఈది ఒక ప్రకరణ గ్రంధం – treatise. Treatise అనేది ఒక అంశాన్ని ఆమూలాగ్రం సందేహాలకు తావులేకుండా వివరిస్తుంది.
వివేక చూడామణి గ్రంధం “గురు-శిష్య సంవాద” రూపంలో నడుస్తుంది. శిష్యుడు అడిగిన ప్రశ్నలకు గురువు సమాధానల రూపంలో సంవాదం జరుగుతుంది. సాధకుని మనలో కలిగే అనేక సందేహాలకు, ప్రశ్నలకు ఇందులో సమాధానాలు దొరుకుతాయి. అవి ఎటువంటి ప్రశ్నలు అంటే:
బంధం ఎంటే ఏమిటి? బంధం ఎలా కలిగింది? బంధం ఎలా కొనసాగుతుంది? బంధం మండి విముక్తి ఎలా కలుగుతుంది? అనాత్మ అంటే ఏమిటీ? పరమాత్మ అంటే ఏమిటి? ఆత్మను అనాత్మను వేరు చేసి చూడటం ఎలా?
ప్రస్థానత్రయ అభ్యాసం
ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయము అంటారు.
ఆధ్యాత్మిక విద్యలో కొంత ప్రవేశం సంపాదించాక, శంకరుల ప్రస్థానత్రయ భాష్యాలను అభ్యసించాలి. సాంప్రదాయ ప్రకారం, ప్రస్థానత్రయ అభ్యాసానికి ముందు శంకరుల శ్రీ విష్ణు సహస్రనామావళి భాష్యాన్ని చెప్పుకోవాలి. ఆ తర్వాత దసోపనిషత్తుల భాష్యాలను, బ్రహ్మసూత్ర భాష్యాన్ని, ఆ తర్వాత భాగవద్గీతా భాష్యాన్ని చెప్పుకోవాలి.
పరిభాష
ఏ శాస్త్రాన్ని తెలుసుకోవాలన్నా, దానికి సంబంధించిన పరిభాష (terminology) తెలియాలి. శంకరుల కాలం నాటికే భాగ్యద్గీత వంటి శాస్త్రాలపై పరస్పర విరుద్ధమైన అనేక వ్యాఖ్యానాలు ఉన్నవి. ఈ మాట శంకరులే గీతా భాష్యం మొదటిలో ఊటక్కరించారు. అందుకే వారి భాష్యాలు పరిభాషా నిర్వచనాలతో సాగుతాయి. తద్వారా, సాధకులకు ఏ పదం ఏ భావంలో వాడారో తేటతెల్ల మవుతుంది. ఇది శంకరుల భాష్య గ్రంధాల యొక్క ప్రత్యేకత.
తెలుగు అనువాదాలు
శంకర భాష్యాలను మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ పుల్లెల రామచంద్రుడు గారు తెలుగు లోకి అనువదించారు. అనువాదాలతో పాటు, ఈ నాటి సాధకులకు అర్థమయ్యే రీతిలో, తేట తెలుగులో “బాలానందిని” అనే పేరుతో వ్యాఖ్యానాలు కూడా రచించారు.
వీరి గ్రంధాలు సాధకులకు మార్గదర్శకాలు.

ఉపనిషత్తులు
ఇవి గురు-శిష్య సంవాద రూపంలో ఉంటాయి. శిష్యుడు అడిగిన ప్రశ్న నుండి గురువు సమాధానం మొదలవుతుంది, కానీ, శిష్యుడి ప్రశ్నకు పూర్వరంగం అక్కడ ఉండదు. అందుకే వివేక చూడామణి వంటి ప్రకరణ గ్రంధాల పఠనం సాధకులకు అత్యావశ్యకం.
ఊపనిషత్తులన్నీ బ్రహ్మమును గురించే చర్చిస్తే, ఇన్ని ఉనపనిషత్తులు ఎందుకు? అనే ప్రశ్న సహజంగా మనకి కలుగుతుంది. దీనికి సమాధానం, సాధకుడు ఏ కోణం నుంచి బ్రహ్మాన్వేషణ మొదలు పెట్టినా, చివరకు బ్రహ్మ జ్ఞానాన్ని ఎలా పొందగలమో సూచిస్తాయి. ఉదా:
కఠోపనిషత్తు, రధాన్ని ఉపమానంగా తీసుకుని, ఇంద్రియాలకు-ప్రాణానికి-మనసుకు-బుద్దికి గల సంబంధాన్ని సూచిస్తుంది. ఆ పైన బుద్దిని ప్రచోదింపజేసేది ఆత్మ చైతన్యమని, అదియే నీ నిజ స్వరూపమని నిరూపిస్తుంది,
మాండూక్యోపనిషత్తు: ఓంకారాన్ని నెపంగా పెట్టి, మూడు అవస్థలలో (జాగ్రత్ -స్వప్న-శుషుప్తి) నామ-రూపాత్మక మైన మానవుని అనుభవా లన్నిటిని మాత్ర-పాదాలుగా వివరించి, అవి చివరకు అ-మాత్ర, అ-పాదం లో లయమౌతాయని, అది తూరీయావస్థ అని, అదే నీ నిజస్వరూపమని నిరూపిస్తుంది.
ఇలా ఒక్కొక్క ఉపనిషత్తుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. సాధకుడు, ఒక్కొక్క ఉపనిషత్తు సారాన్నీ jigsaw puzzle లో ముక్కలు అమర్చిననట్లు ఒకదానితో మరొకటి సంధానం చేసుకుంటే, బ్రహ్మము యొక్క సర్వదిగ్దర్శక దృశ్యము (panoramic view) కలుగుతుంది.
బ్రహ్మసూత్రాలు
ఊపనిషత్తులలోని అంశాలు ఎక్కడైనా inconsistent గా అనిపిస్తే, వాటిని బ్రహ్మసూత్రాలు పరిష్కరిస్తాయి. ఇది విమర్శనాత్మకమైన ఉత్కృష్ట గ్రంధం. దీనిని అభ్యసించడానికి, షడంగాలు (శిక్ష, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం, ఛందస్సు), షడ్దర్శనాలు (న్యాయం, వైశేషికం, సాంఖ్యం, యోగం, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస) తెలిసి ఉండాలి. “అథాతో బ్రహ్మజిజ్ఞాస” అనే మొదటి సూత్రంలోనే, అధికారి ఉండవలసిన సాధన సంపత్తి/లక్షణాలు ఏముటీ? అని సుదీర్ఘమైన చర్చ జరుగుతుంది. శంకరుల భాష్యం లేనిదే ఈ గ్రంధం ఏ మాత్రం కొరుకు బడదనడం అతిశయోక్తి కాదు.
భగవద్గీత
భగవద్గీతను ఉపనిషత్తుల సారమని అంటారు. ఈ విషయం గీతా ధ్యాన శ్లోకంలోనే కనబడుతుంది:
సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలానందనః
పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ |
భగవద్గీతను “తత్వమసి” అనే మహావాక్యానికి వివరణ అని పెద్దలు అంటారు. మొదటి 6 అధ్యాయాలు “త్వం” పదార్థ శోధనగా, మధ్య 6 అధ్యాయాలు “తత్” పదార్థ శోధనగా, ఆఖరి 6 అధ్యాయాలు “అసి” పదార్థ శోధనగా చెబుతారు.
గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ స్పృసించని మానవ జీవితానికి సంబంధించిన అంశము ఏది లేదు, దానికి శంకరులు వ్రాయని వివరణ అంతకన్నా లేదు. నాలుగు పురుషార్థాలకు సంబంధించిన అనేకానేక విషయాలు శ్రీ కృష్ణ పరమాత్మ ప్రస్తావించాడు. మన స్థాయి ఏదయినా, గీతా శ్లోకాలలో ఎక్కడో ఒక చోట మన జీవితానికి సమాధానం, పరమార్థం రెండు దొరుకుతాయి.
శంకరుల భాష్యంతో గీతను ప్రతి మానవుడు చదివి తెలుసుకోవలసినదే!
బ్రహ్మజ్ఞాన సాధన మార్గం
బ్రహ్మ జ్ఞానాన్ని అవలంబించడానికి యాజ్ఞవల్క్య మహర్షి “శ్రవణం-మననం-నిదిధ్యాసన” అని మూడు సూత్రాలను/సోపానాలను సూచించాడు. ఉపనిషత్తులను శ్రవణంచేసి, వాటి సారాన్ని బ్రహ్మసూత్రాల పఠనంతో మననం చేసి, భగవద్గీత ఉపదేశాన్ని నిదిధ్యాసన చేయాలని పెద్దలు చెపుతారు. ఈ విధంగా సాధకులు ఈ మూడు సూత్రాలను పాటిస్తే, బ్రహ్మజ్ఞానం తప్పక లభించగలదు.
దీనికై సాధకునికి అకుంఠిత దీక్ష, శ్రద్ధ, జిజ్ఞాసతో పాటు ముముక్షుత్వం ఉండాలి.
అయితే, మనవంటి సంసారులకు తరుణోపాయం లేదా? ఉంది. అది కూడా శంకరులు తమ మోహమద్గర (భజగోవింద శ్లోకం) లో సులభోపాయాన్ని సూచించారు:
సత్సంగత్వే నిఃసంగతవ్యం – నిఃసంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్వం – నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః ||

ఉపసంహారం
సత్సంగం మనవంటి సంసారులకు ఎంత ఆవశ్యకమో తెలుపుతుంది. ఈ నాటి ఈ సభ సత్సంగం సాంప్రదాయానికి నాంది పలుకగలదని ఆశిస్తున్నాను. శంకరుల రచనలు పఠించడమే మనం వారికి సమర్పించే నిజమైన గురు వండన.
శంకరులు అవ్యాజ కరుణతో తమ భాష్యాలను మానవాళికి అనుగ్రహించారు. వారికి ఆస్తిక లోకం ఎల్లప్పుడూ ఋణపడి ఉంటుంది. వారి వాఙ్మయము విస్తారమైనది, వాటిలోని భావాలు లోతైనవి. నాకు ఇచ్చిన ఈ సమయంలో వాఙ్మయము గురించి మాట్లాడడము ఒక దుస్సాహసమే! 

ఈ అవకాశము నాకు ఇచ్చినందుకు శ్రీ వేద గాయత్రీ పరిషత్కార్యవర్గ సభ్యులకు పేరు పేరునా ధన్యవాదాలు.

Shopping Cart